Film industry subsidy: సినిమా రంగాన్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో కనీసం 50 శాతం షూటింగ్ జరుపుకొనే సినిమాలకు గరిష్టంగా 2 కోట్ల రూపాయల వరకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా లొకేషన్లకు చెల్లించే ఫీజులో సుమారు 75 శాతం వరకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తోంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలలోనైనా షూటింగ్ జరుపుకొనేలా అనుమతులు సరళతరం చేసింది. ప్రోత్సాహకాలు, అనుమతులు, షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం లాంటి చర్యలతో తమ రాష్ట్రంలో సినిమా రంగాన్ని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయనున్నామని మధ్య ప్రదేశ్ టూరిజం బోర్డు డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి వెల్లడించారు.
ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాలు, రాయితీ వివరాలు తెలిపేందుకు ఆయన తన స్టాఫ్ తో పాటు హైదరాబాద్ కు వచ్చారు. ముఖ్యంగా దళారుల ప్రమేయం అస్సలు లేకుండా, మధ్యవర్తులతో పని లేకుండా నేరుగా సినిమా రంగం వారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ రాయితీలను అందుకోవాలని కోరారు. ప్రతి విషయంలోనూ తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
దేశంలో ఎక్కడా లేని సౌలభ్యాలు కల్పిస్తున్నాం..
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మధ్య ప్రదేశ్ లో సినిమా రంగం వారికి సౌలభ్యాలు కల్పిస్తున్నామని ఉమాకాంత్ చౌదరి తెలిపారు. అద్భుతమైన సందర్శన ప్రాంతాలు ప్రపంచానికి పరిచయం చేయడానికి, ప్రోత్సాహకాలు అందించడానికి ముందుకొస్తున్నామన్నారు. ప్రత్యేకంగా దీని కోసం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించామని, అన్ని విషయాలూ అందులో ఉన్నాయన్నారు. ఈ సదవకాశం దక్షిణాది భాషా చిత్రాలకు వర్తిస్తుందని వివరించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దేశంలో సినిమా రంగం అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. రాబోయే సంవత్సరాల్లో మరింత బిజినెస్ చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సినిమా ఇండస్ట్రీని ఆకర్షించడంలో భాగంగా పలు రాయితీలను కల్పిస్తున్నాయి. మొత్తానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేయగా.. త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.