
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో మైలురాయిని అందుకుంది. దేశంలోని అత్యంత భారీ బరువుగల ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5) ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.
ఈ రాకెట్ కి ముద్దుగా ‘”బాహుబలి రాకెట్” అని కూడా పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం నవంబర్ 2, 2025న సాయంత్రం 5.26 గంటలకు జరిగింది.
ఈ రాకెట్ సుమారు 4,410 కిలోల బరువున్న CMS-03 (GSAT-7R) అనే ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి ఉంచింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా సముద్రతీర మరియు రక్షణ కమ్యూనికేషన్ అవసరాల కోసం రూపొందించబడింది.
ముఖ్యంగా భారత నౌకాదళానికి (Indian Navy) అధునాతన కమ్యూనికేషన్ సేవలు, భద్రతా లింకులు, మరియు అధిక బ్యాండ్‌విడ్త్ సదుపాయాలను అందించనుంది.
ఈ ప్రయోగం ద్వారా ఐఎస్‌ఆర్‌ఓ భారత అంతరిక్ష రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఇప్పటివరకు దేశం చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది అత్యంత భారీదిగా నిలిచింది.
“బాహుబలి రాకెట్” అని పిలిచే ఎల్‌వీఎం3 రాకెట్ GSLV సిరీస్‌లో భాగం. ఇది భారత అంతరిక్ష కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రాకెట్ భవిష్యత్‌లో గగనయాన్ (మానవ అంతరిక్ష మిషన్) వంటి ముఖ్యమైన ప్రాజెక్టులకు ఉపయోగపడనుంది.
ప్రయోగం ముందు వాతావరణ పరిస్థితులు, సాంకేతిక పరీక్షలు వంటి అనేక సవాళ్లను అధిగమించి, శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ మిషన్‌ను పూర్తి చేశారు. ఉపగ్రహం సమర్థవంతంగా కక్ష్యలో ప్రవేశించిందని, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఐఎస్‌ఆర్‌ఓ అధికారికంగా ప్రకటించింది.
ఈ విజయంతో భారత్ ప్రపంచ అంతరిక్ష రంగంలో తన ప్రతిభను మరింతగా చాటుకుంది. బాహుబలి రాకెట్ మరోసారి దేశ గౌరవాన్ని అంతరిక్షంలో ఎగరేసింది.
